

భారత చెస్ చరిత్రలో మరో కీలక మైలురాయి నమోదైంది. దేశంలో గ్రాండ్‌మాస్టర్ల సంఖ్య 100కు చేరింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల అనుజ్ శ్రీవాత్రి భారత వందో గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డులకెక్కాడు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్ ప్లస్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో పాటు 2,500 ఎలో రేటింగ్ పాయింట్లను దాటాడు. దీంతో గ్రాండ్‌మాస్టర్ హోదాకు అవసరమైన మూడో, చివరి నార్మ్‌ను కూడా సాధించాడు. 1988లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ భారత్ తరఫున తొలి గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు భారత్ నుంచి ఐదుగురు కొత్త గ్రాండ్‌మాస్టర్లు ఆవిర్భవించడం విశేషం.
మధ్యప్రదేశ్‌లోని కాట్నీకి చెందిన అనుజ్ ఏడేళ్ల వయసులోనే చెస్ ఆడటం ప్రారంభించాడు. ఆటలో ప్రతిభ చూపిస్తూ 2020లో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎమ్) హోదా సాధించాడు. అయితే, గ్రాండ్‌మాస్టర్ లక్ష్యంగా సాగుతున్న అతడి ప్రయాణానికి కొవిడ్ మహమ్మారి అడ్డంకిగా మారింది. ఆ సమయంలో టోర్నీలు అందుబాటులో లేకపోవడంతో చదువుపై దృష్టి పెట్టాడు. బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో నైపుణ్యం సంపాదించి జర్మనీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కూడా సాధించాడు. అయినప్పటికీ చెస్‌పై ఉన్న మక్కువతో జర్మనీ వెళ్లి ఉద్యోగం చేయాలన్న అవకాశాన్ని వదులుకుని ఆటపైనే దృష్టి సారించాడు. తల్లిదండ్రులు కూడా అతడికి అండగా నిలిచారు. వారి ప్రోత్సాహంతో పట్టుదలగా శ్రమించిన అనుజ్ చివరకు భారత వందో గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్ర సృష్టించాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!