

భారత క్రికెట్ మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్.. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ వంటి సీనియర్ ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2012 నుంచి 2016 వరకు తన పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో’లో మాట్లాడుతూ.. సీనియర్ ఆటగాళ్లను కొనసాగించాలా? కొత్తవారికి అవకాశాలు కల్పించాలా? అనే అంశాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు భారత క్రికెట్ భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఈ నిర్ణయాలు తన వ్యక్తిగత అభిప్రాయాల మేరకు తీసుకున్నవి కావని, ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ సమష్టిగా నిర్ణయాలు తీసుకుందని స్పష్టం చేశారు.
సెలెక్టర్లకు ఆటగాళ్లతో వ్యక్తిగత స్నేహాలు, అనుబంధాలు ఉండటం సహజమేనని సందీప్ పాటిల్ పేర్కొన్నారు. అయితే, ఎంపిక బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు వాటిని పక్కన పెట్టి నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించారు. స్నేహం కారణంగా ఒక ఆటగాడికే ప్రాధాన్యత ఇవ్వడం సరైన పద్ధతి కాదని, వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. కొన్నిసార్లు బాధాకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, భారత క్రికెట్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని వివరించారు. సచిన్, యువరాజ్, గంభీర్, జహీర్ వంటి దిగ్గజ ఆటగాళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలను కూడా ఈ బాధ్యతలో భాగంగానే చూడాలని ఆయన వ్యాఖ్యల సారాంశం.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!