

యూఏఈపై యువ భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చేసిన విధ్వంసకర బ్యాటింగ్ చూసి వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఆశ్చర్యపోయాడు. ఇటలీ టీ10 టోర్నీలో ఆడుతున్న గేల్.. వైభవ్ సాధించిన ద్విశతకంపై స్పందించాడు. ఆ రోజు తన ఫోన్ వరుసగా మోగుతుండటంతో ఏం జరిగిందా అని ఆరా తీసినట్లు తెలిపాడు. వైభవ్ డబుల్ సెంచరీ గురించి తెలిసినప్పుడు తొలుత టీ20 మ్యాచ్‌లో సాధించాడని భావించానని, అయితే అది వన్డే మ్యాచ్ అని తెలియగానే విస్మయం చెందానని చెప్పాడు. ఈ కుర్రాడు ఆట స్వరూపాన్నే మార్చేస్తాడని ప్రశంసించాడు. ప్రత్యర్థి యూఏఈనే కదా అని అతడి ప్రదర్శనను తక్కువగా అంచనా వేయకూడదని, ఏ జట్టుపైనైనా ఇలాంటి స్థాయి హిట్టింగ్ చేయడం చాలా కష్టమని గేల్ అభిప్రాయపడ్డాడు. వైభవ్‌కు మరిన్ని అవకాశాలు రావాలని, అతడి ప్రతిభ మరుగున పడకూడదని ఆకాంక్షించాడు.
వైభవ్‌ను ‘బేబీబాస్’ అని పిలవడంపై కూడా గేల్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తనకు ఉన్న ‘యూనివర్స్ బాస్’ పేరుతో పోల్చడం కంటే వైభవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించాడు. రోహిత్ శర్మకు ‘హిట్‌మ్యాన్’, ఏబీ డివిలియర్స్‌కు ‘360’ అనే పేర్లు ఉన్నట్లుగా వైభవ్ కూడా తనదైన బ్రాండ్‌ను సృష్టించుకోవాలని ఆకాంక్షించాడు. అతడు సొంత గుర్తింపును సంపాదించుకుంటాడనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. అయితే ‘యూనివర్స్’ మాత్రం తనదేనంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!