

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దాదాపు 19 ఏళ్ల పాటు సారథిగా, బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించిన మహేంద్ర సింగ్ ధోని.. ఆటగాడిగా తన ప్రయాణాన్ని ముగించనున్నారనే వార్త అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుతో మెంటార్‌గా తన అనుబంధాన్ని కొనసాగిస్తూ, తన అపారమైన క్రికెట్ అనుభవాన్ని జట్టుకు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ధోని భార్య సాక్షి ధోని సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. జీవితంలో అందమైన కొత్త ప్రయాణాలు ప్రారంభం కావాలంటే కొన్ని అధ్యాయాలకు ముగింపు పలకాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. మహీపై తనకున్న ప్రేమను, గర్వాన్ని ఈ పోస్టు ద్వారా వ్యక్తం చేశారు.
పర్వతాల వైపు చూస్తూ ధోని పోజిచ్చిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సాక్షి.. ఇన్నేళ్లుగా మహీని ప్రేమించి, నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ‘‘మహీని ఇన్నేళ్లుగా ప్రేమించి, నమ్మిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. కొత్త ఆరంభాలకు, సరికొత్త సాహసాలకు, మరెన్నో అందమైన జ్ఞాపకాలకు స్వాగతం. మహీ.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది’’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ధోని, సాక్షిల పరిచయం కోల్‌కతాలోని తాజ్ హోటల్‌లో మొదలై, ఆ తర్వాత స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. 2010లో దేహ్రాదూన్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రం కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!