

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పెరుగుతున్న పోటీ వచ్చే ఏడాది టెక్ కంపెనీలను భారీ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ హెచ్చరించారు. అత్యాధునిక ఏఐ మోడళ్ల అభివృద్ధికి అవసరమైన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని, ఈ క్రమంలో ఊహించని స్థాయిలో నగదు కొరత ఏర్పడవచ్చని అభిప్రాయపడ్డారు. ఏఐ పరిశోధకుడు ఫ్రాంకోయిస్ చోలెట్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారీ కంప్యూటింగ్ వ్యవస్థల ఏర్పాటు, నిరంతర విద్యుత్ సరఫరా, శీతలీకరణ సదుపాయాల నిర్వహణ టెక్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ సంస్థలు డేటా సెంటర్లు, ఎన్విడియా జీపీయూ చిప్‌ల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి.
మరోవైపు, 2029 వరకు హెచ్‌బీఎం, డీఆర్‌ఏఎం మెమరీ చిప్‌ల ఉత్పత్తి సామర్థ్యం ఇప్పటికే బుక్ అయిపోయిందని ఫ్రాంకోయిస్ చోలెట్ పేర్కొన్నారు. ఇది ఏఐ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమని వివరించారు. అయితే ఈ భారీ పెట్టుబడుల వల్ల కంపెనీలపై పడే ఆర్థిక భారంపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. చిప్‌ల కొనుగోలు, డేటా సెంటర్ల నిర్మాణానికి ముందుగానే భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, వాటి ద్వారా ఆదాయం సమకూరడానికి మాత్రం సమయం పడుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వందల బిలియన్ల డాలర్ల అదనపు నిధులు సమకూర్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏఐ పోటీలో ఆధిపత్యం సాధించేందుకు కంపెనీలు చేస్తున్న భారీ ఖర్చులు భవిష్యత్తులో వాటిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశముందని మస్క్ వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో చర్చకు దారితీశాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!