

ఈ నెల చివరి వారంలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ముందుగా విడుదల తేదీలు ప్రకటించిన రష్మిక మందన్న ‘మైసా’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’తో పాటు మరికొన్ని చిత్రాలు వాయిదా పడటంతో ఈ వారం కొన్ని సినిమాలు మాత్రమే థియేటర్లలోకి రానున్నాయి. శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ‘భోగి’ నవంబర్ 27న విడుదల కానుంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 1960ల ప్రారంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో సాగుతుంది. విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో ము. మారన్ దర్శకత్వం వహించిన ‘నాన్న కుట్టి’ కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా రూపొందింది.
ఇక ఎస్. కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘హై’ నవంబర్ 27న విడుదల కానుంది. అనన్య శర్మ, పల్లవి దొర, కృష్ణ కమల్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. విభిన్నమైన కథాంశం, కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి ప్రధాన పాత్రల్లో అభిజిత్ తీర్ధహళ్లి తెరకెక్కించిన ‘డేంజర్ బాయ్స్’ కూడా అదే రోజు తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమా మార్నింగ్ షోలను అన్ని థియేటర్లలో ఉచితంగా ప్రదర్శించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ‘జయమ్మ పంచాయితీ’ దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు రూపొందించిన ‘బాల 369’ సైతం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్విన్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. ఇలా ఈ వారం ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!