

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతోంది. ఉత్పాదకతను పెంచుకునేందుకు కంపెనీలు ఏఐ టూల్స్, ఆటోమేషన్‌పై పెట్టుబడులు పెంచుతున్నాయి. అదే సమయంలో ఉద్యోగాల కోతలు, మారుతున్న నైపుణ్యాల అవసరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నందన్ నీలేకని భారత్‌లో ఉద్యోగాల భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ 2026లో మాట్లాడుతూ, ఏఐ సాంకేతికతను విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. వేలాది ఏఐ మోడళ్లు, టూల్స్ అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఈ సాంకేతికతను కేవలం ఉద్యోగాల కోతల కోణంలోనే చూడకూడదని అభిప్రాయపడ్డారు.
భారత్‌లో చిన్న వ్యాపారాలు కొత్త ఉద్యోగాల కల్పనకు ముఖ్యమైన ఆధారంగా మారతాయని నీలేకని పేర్కొన్నారు. ఏఐ, ఓపెన్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ టూల్స్ సాయంతో చిన్న సంస్థలు తమ పనితీరును మెరుగుపరచుకుని, మరింత మంది వినియోగదారులకు సేవలు అందిస్తూ విస్తరించగలవని వివరించారు. కొద్ది మంది ఉద్యోగులతో నడిచే సంస్థల్లోనూ కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం, సేవలు అందించడం వంటి పనులకు మానవ వనరులు అవసరమవుతాయని అభిప్రాయపడ్డారు. చిన్న వ్యాపారాలు విస్తరించే కొద్దీ అదనపు ఉద్యోగులను నియమించుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ మార్పు ఎప్పటిలోగా జరుగుతుందనే నిర్దిష్ట కాలపరిమితిని ఆయన వెల్లడించలేదు. అయితే మార్కెట్లు, మూలధనం, పరిజ్ఞానం, ఏఐ టూల్స్ అందుబాటులో ఉండటం భారతీయ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడంతో పాటు కోడింగ్ నైపుణ్యాలు కలిగి ఉండటం కూడా టెక్నాలజీ రంగంలో అవకాశాలను పెంచుతుందని తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!