

అంతర్జాతీయ అనిశ్చితి, పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా–ఇరాన్ యుద్ధ ప్రభావం కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 6.4 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. 2027–28 ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి రేటు 7 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.
దేశీయంగా వినియోగం బలంగా ఉండటం, సేవల రంగంలో కార్యకలాపాలు మెరుగ్గా కొనసాగడం ఈ అంచనాల పెంపునకు ప్రధాన కారణాలని ఐఎంఎఫ్ పేర్కొంది. విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, అనుకూలమైన జనాభా నిర్మాణం, నిర్మాణాత్మక సంస్కరణలు కూడా మధ్యకాలిక ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. గత అంచనాలతో పోలిస్తే భారత ఆర్థిక కార్యకలాపాలు మెరుగ్గా కొనసాగుతున్నాయని వివరించింది.
మరోవైపు, వృద్ధి అంచనాలను పెంచినప్పటికీ ద్రవ్యోల్బణంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్ సూచించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం సగటున 5 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. 2027–28లో ఇది 4.4 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరల్లో మార్పులు భారత ఆర్థిక వ్యవస్థకు కీలక అంశాలుగా కొనసాగనున్నాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!