

శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతుల విషయంలో భారత ప్రభుత్వం, స్టార్‌లింక్ అధినేత ఎలాన్ మస్క్ మధ్య వివాదం ముదిరింది. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కాకుండా కొందరు దేశీయ పారిశ్రామికవేత్తలు అడ్డుకుంటున్నారన్న మస్క్ వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలోని అన్ని శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలకు ఒకే విధమైన నియంత్రణ, భద్రతా నిబంధనలు వర్తిస్తాయని టెలికాం విభాగం స్పష్టం చేసింది. మస్క్ ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 165కి పైగా దేశాల్లో స్టార్‌లింక్‌కు అనుమతులు ఉన్నాయని, భారత చట్టాలు, నిబంధనలను పాటిస్తూ ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ తుది అనుమతులు ఎందుకు రావడం లేదని మస్క్ ప్రశ్నించారు. దేశీయ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం కొందరు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ‘భారత్‌కు నిజమైన బాస్ అంబానీనా?’ అంటూ ఎక్స్‌లో చేసిన వ్యాఖ్య మరింత చర్చకు దారితీసింది.
భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం స్టార్‌లింక్, జియో శాట్‌కామ్, యుటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థలకు ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేసింది. అయితే, ఈ సంస్థలేవీ ఇంకా వాణిజ్య సేవలను ప్రారంభించలేదని, అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. భద్రతా అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం కేంద్ర హోం శాఖ వద్ద ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఏ సంస్థకూ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వివాదంపై స్పందిస్తూ, ‘అసలైన బాస్‌గా వ్యవహరించే మరో వ్యక్తిని మీరు కనుగొంటారని ఆశిస్తున్నా’ అని మస్క్‌ను ఉద్దేశించి ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి మస్క్ కృతజ్ఞతలు తెలుపుతూ స్పందించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!