

భారత్-అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించి చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యాయని, మిగిలిన కొన్ని అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని ఓ వార్తాసంస్థ నిర్వహించిన కార్యక్రమంలో వెల్లడించారు. ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాల్లోనూ ఎక్కువ భాగం అమెరికా వైపు నుంచే మార్పులు అవసరమని పేర్కొన్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భారత్‌కు లాభదాయకంగా, సమతుల్యంగా ఉండటంతో పాటు పోటీ దేశాలతో పోలిస్తే అదనపు ప్రయోజనాలు కల్పించే వాణిజ్య ఒప్పందం అవసరమని జైశంకర్ అన్నారు. ఈ ఒప్పందాన్ని కేవలం వాణిజ్య కోణంలోనే కాకుండా.. ఇరు దేశాల మధ్య ఉన్న విస్తృత సంబంధాల నేపథ్యంలో చూడాలని సూచించారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద మార్కెట్ అని, ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్‌కు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడమే ప్రధాన సవాలని, ఈ అంశం ప్రజల జీవనోపాధితో ముడిపడి ఉందని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!