

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. భారతదేశం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమని నెహ్రూ కాలం నుంచి నేటి వరకు చెబుతున్నారని గుర్తుచేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం దేశంలో ప్రజాస్వామ్యం లేదని, నియంతృత్వ పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వంటి సంస్థలు గతంలోనూ ఉన్నాయని, ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఈటల పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చివరకు సైనికులను కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. దేశంలో ఎలాంటి కుంభకోణాలు, అవినీతి లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని అన్నారు. దేశం గర్వించేలా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై విమర్శలు చేసే ముందు వాటి ప్రాధాన్యాన్ని గుర్తించాలని రాహుల్ గాంధీకి సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!