

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (JPL) ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై 23న ముగియనుంది. ఒక్కో షేరుకు రూ.1,065–1,119 ధరల శ్రేణిని నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ.30,213 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యం నెరవేరితే దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. మొత్తం 27 కోట్ల వరకు తాజా షేర్లను జారీ చేయనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లు అక్టోబర్ 19న దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 28న షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి. కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ఠ ధర ప్రకారం ఒక లాట్‌కు రూ.13,428 పెట్టుబడి అవసరం. అర్హులైన రిలయన్స్ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.54 తగ్గింపు లభిస్తుంది. ఉద్యోగుల కోసం రూ.500 కోట్ల విలువైన షేర్లను, అర్హులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల కోసం రూ.2,500 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు.
ముసాయిదా పత్రాల ప్రకారం, 2025–26 ఆర్థిక సంవత్సరంలో జియో ప్లాట్‌ఫామ్స్ కార్యకలాపాల ఆదాయం 14.6 శాతం పెరిగి రూ.1,46,885 కోట్లకు చేరింది. నికర లాభం 15.1 శాతం వృద్ధితో రూ.30,049 కోట్లుగా నమోదైంది. 2026 మార్చి చివరి నాటికి కంపెనీకి 52.4 కోట్ల మంది చందాదారులు ఉండగా, ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం రూ.214గా ఉంది. మొత్తం రుణాలు 3.1 శాతం తగ్గి రూ.70,781 కోట్లకు చేరాయి. ఐపీఓ పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారా జరగనుండటంతో సమీకరించిన నిధులు కంపెనీకే వెళ్తాయి. వాటిని అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రుణాల చెల్లింపుతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 66.43 శాతం, మెటా-గూగుల్‌కు కలిపి 17.7 శాతం వాటా ఉంది. ఈ ఐపీఓ లక్ష్య మొత్తాన్ని సమీకరిస్తే, 2024లో రూ.27,858.75 కోట్లు సమీకరించిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓను అధిగమిస్తుంది. అలాగే రూ.20,557.23 కోట్లు సమీకరించిన ఎల్ఐసీ ఐపీఓను దాటి భారత మార్కెట్లో కొత్త రికార్డు సృష్టించనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!