

దేశవ్యాప్తంగా 63 ఫైనాన్స్ కంపెనీలపై భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక చర్యలు చేపట్టింది. వీటిలో 49 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (NBFC) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేయగా, మరో 14 సంస్థలు స్వచ్ఛందంగా తమ రిజిస్ట్రేషన్లను సరెండర్ చేశాయి. అక్టోబర్ నెలలో జారీ చేసిన వివిధ ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి 29వ తేదీ మధ్య ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్లు సరెండర్ చేసిన సంస్థల్లో 13 ఎన్‌బీఎఫ్‌సీలు, ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దయిన సంస్థలు ఇకపై ఆర్బీఐ అనుమతి అవసరమయ్యే ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుండదు. ముఖ్యంగా రుణాల మంజూరు, ఇతర నియంత్రిత ఆర్థిక లావాదేవీలను కొనసాగించడానికి అనుమతి ఉండదని స్పష్టమవుతోంది. ఆర్థిక రంగంలో నిబంధనల అమలును పర్యవేక్షించే క్రమంలో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!