

భారత్‌లో ప్రతి వాహనానికీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. బీమా లేకుండా వాహనం నడిపితే మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే, సాధారణంగా ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించినప్పుడే వాహనానికి బీమా ఉందా లేదా అన్న విషయం బయటపడుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త విధానాన్ని పరీక్షిస్తోంది. దీని ప్రకారం, చెల్లుబాటయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనం జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా దాటితే వాహన యజమానికి ఎస్సెమ్మెస్ అలర్ట్ పంపిస్తారు. వాహనదారులు బీమాను సకాలంలో రెన్యువల్ చేసుకునేలా ప్రోత్సహించడం ఈ విధానం లక్ష్యం.
ప్రస్తుతం దిల్లీలోని ఓ టోల్‌ప్లాజా వద్ద ఎన్‌హెచ్‌ఏఐ ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తోంది. వాహనం టోల్‌ప్లాజా దాటిన వెంటనే దాని రిజిస్ట్రేషన్ వివరాలను వాహన్ డేటాబేస్‌లో తనిఖీ చేసి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గడువును పరిశీలిస్తారు. పాలసీ గడువు ముగిసినట్లయితే వాహన రిజిస్ట్రేషన్ నంబర్, బీమా ముగిసిన తేదీ వంటి వివరాలతో యజమానికి ఎస్సెమ్మెస్ పంపిస్తారు. బీమాను గడువు ముగిసిన వెంటనే రెన్యువల్ చేసుకోవడం ద్వారా జరిమానాలను నివారించుకోవచ్చని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. నివేదికలో పేర్కొన్న జరిమానా వివరాల ప్రకారం, బీమా లేకుండా వాహనం నడిపితే బేస్ ప్రీమియానికి మూడు రెట్లు లేదా రూ.5,000 జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదే తప్పును మరోసారి చేస్తే బేస్ ప్రీమియానికి ఐదు రెట్లు లేదా రూ.10,000. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!