

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత్ చమురు దిగుమతుల్లో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రష్యా నుంచి సెప్టెంబరులో రోజుకు సుమారు 18 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంది. ఆగస్టుతో పోలిస్తే ఈ పరిమాణం దాదాపు స్థిరంగా ఉన్నప్పటికీ, జులైలో నమోదైన 28.2 లక్షల బ్యారెళ్లతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. రష్యా చమురును చైనా భారీగా కొనుగోలు చేయడం, భారత రిఫైనరీల్లో నిర్వహణ పనులు కొనసాగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.
రష్యా నుంచి తగ్గిన దిగుమతుల అంతరాన్ని పశ్చిమాసియా దేశాలు భర్తీ చేస్తున్నాయి. కెప్లర్ గణాంకాల ప్రకారం, రష్యా నుంచి ఆగస్టులో రోజుకు 20.8 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా, సెప్టెంబరులో సుమారు 18 లక్షల బ్యారెళ్లకు పరిమితమైంది. ఇదే సమయంలో ఇరాక్ నుంచి సెప్టెంబరులో 5.05 లక్షల బ్యారెళ్ల చమురు వచ్చింది. ఆగస్టులో ఇది 1.63 లక్షల బ్యారెళ్లుగా ఉంది. సౌదీ అరేబియా నుంచి దిగుమతులు 3.47 లక్షల నుంచి 5.76 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. యూఏఈ నుంచి ఆగస్టులో 5.46 లక్షల బ్యారెళ్లు రాగా, సెప్టెంబరులో 5.22 లక్షల బ్యారెళ్లుగా నమోదయ్యాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!