

బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా కంటెస్టెంట్ల మధ్య ఉన్న విభేదాలు, మనసులో దాచుకున్న కోపాలు నామినేషన్ల సమయంలో బయటపడుతుంటాయి. అయితే ఈ వారం జరిగిన నామినేషన్లలో మాత్రం వాగ్వాదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి మంచి స్నేహితులుగా ఉన్న సుధీర్, ముకేష్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా, మరోవైపు నీతూ ఆవేశంలో తనను తాను కొట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
హౌస్‌లో మొదటి వారం నుంచి సుధీర్, ముకేష్ మంచి స్నేహితులుగా కొనసాగారు. ఒకే గ్రూపులో ఉంటూ పలు సందర్భాల్లో ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. అయితే తాజాగా నామినేషన్ల సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గతంలో సుధీర్‌కు మద్దతుగా తన పవర్‌ను ఉపయోగించుకున్న విషయాన్ని ముకేష్ పదేపదే ప్రస్తావించాడు. అంతేకాకుండా, తన సహాయం లేకపోతే సుధీర్ కెప్టెన్‌గా మారేవాడు కాదని, కనీసం కంటెండర్‌గా కూడా అర్హత సాధించేవాడు కాదని వ్యాఖ్యానించాడు. దీంతో సుధీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన ఎదుగుదలకు ముకేష్‌నే కారణమన్నట్లుగా మాట్లాడటాన్ని తప్పుబట్టాడు.
ముకేష్ వ్యాఖ్యలకు సుధీర్ కూడా గట్టిగానే బదులిచ్చాడు. ముకేష్‌ను ఉద్దేశించి 'గుండు సున్నా' అంటూ సెటైర్ వేశాడు. ఈ వివాదంలో శివ కూడా జోక్యం చేసుకుంటూ ముకేష్‌ను 'మబ్బేష్' అంటూ ఎద్దేవా చేశాడు. మరోవైపు వర్షిణి స్పందిస్తూ, ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్న ఇద్దరు స్నేహితుల మధ్య ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అభిప్రాయపడింది. దీంతో సుధీర్, ముకేష్ మధ్య జరిగిన మాటల యుద్ధం హౌస్‌లో ప్రధాన చర్చగా మారింది.
ఇదిలా ఉంటే, మరోవైపు నీతూ ప్రవర్తన కూడా నామినేషన్లలో తీవ్ర చర్చకు దారితీసింది. త్రిగుణ్, వంశీలతో నామినేషన్ పాయింట్ల విషయంలో ఆమెకు వాగ్వాదం జరిగింది. తన కుటుంబం, వ్యక్తిగత కష్టాల గురించి ప్రస్తావన రావడంతో భావోద్వేగానికి గురైన నీతూ సహనం కోల్పోయి తన చెంపపై తానే కొట్టుకుంది. గతంలో వంశీ కూడా ఇలాంటి ప్రవర్తనకు పాల్పడినప్పుడు హోస్ట్ నాగార్జున హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నీతూ విషయంలోనూ నాగార్జున ఎలా స్పందిస్తారన్న ఆసక్తి నెలకొంది.
మరోవైపు నరేష్, శ్వేత కూడా నీతూ ఆటతీరును ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు. ముఖ్యంగా స్యాక్ గేమ్ సమయంలో నీతూ వంశీని కొట్టిన విషయాన్ని నరేష్ ప్రస్తావించగా, ఆమె తన వాదనతో సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో వారి మధ్య కూడా వాగ్వాదం కొనసాగింది. మొత్తానికి ఈ వారం నామినేషన్లు సుధీర్, ముకేష్ స్నేహంలో విభేదాలు, నీతూ భావోద్వేగ ప్రవర్తనతో మరింత ఆసక్తికరంగా మారాయి. వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!