

పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధికి స్థిరమైన పాలన, వేగవంతమైన నిర్ణయాలు, ఉద్యోగాల కల్పన ఎంతో అవసరమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యూఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా నిర్వహించిన ఫైర్‌సైడ్ చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఏపీ ప్రభుత్వ సంస్కృతిగా మారిందని తెలిపారు. ఫైళ్ల పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ, ప్రాజెక్టుల అమలులో వేగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అంతరిక్షం, డ్రోన్లు, సిమెంట్, ఉక్కు, వైద్య పరికరాలు, ఔషధాలు, కృత్రిమ మేధ, డేటా కేంద్రాలు, ఉద్యానవనం, ఆక్వా రంగాలతో పాటు మొత్తం 23 ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. స్కైరూట్, ఆర్సెలర్ మిట్టల్ వంటి సంస్థల ప్రాజెక్టులను క్లస్టర్ ఆధారిత విధానానికి ఉదాహరణలుగా పేర్కొన్నారు. కేవలం అవగాహన ఒప్పందాలకే పరిమితం కాకుండా ప్రాజెక్టులను భూమిపైకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని, 80 శాతం ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 2047 నాటికి ఏపీ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలను నాలుగో భాగస్వాములుగా చేర్చిన పీ4 విధానాన్ని అమలు చేస్తున్నామని లోకేశ్ వివరించారు. అభివృద్ధి ఫలాలు పేదలు, వెనుకబడిన వర్గాలకు కూడా అందేలా ఈ విధానం పనిచేస్తుందని చెప్పారు. కుప్పంలో గతంలో ఇటుకల బట్టీలో పనిచేసిన ఓ మహిళ ప్రస్తుతం సొంతంగా అదే వ్యాపారం నిర్వహిస్తూ 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఉదాహరణగా పేర్కొన్నారు. రూ.60 వేల పెట్టుబడితో ఈ మార్పు సాధ్యమైందని, లెక్కల నిర్వహణ, కొత్త మార్కెట్ల గుర్తింపు, విక్రయాలు, మార్కెటింగ్‌పై ఆమెకు మార్గదర్శకత్వం అందిందని తెలిపారు.
క్వాంటమ్ సాంకేతికత ఎంత ముఖ్యమో ఉద్యానవనం, ఆక్వా రంగాలు కూడా అంతే ముఖ్యమని లోకేశ్ అన్నారు. అక్టోబర్ 2న హార్టికల్చర్ మిషన్‌ను ప్రారంభించనున్నామని, ఈ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కంపెనీలు పాఠశాలలను దత్తత తీసుకోవడం, పాఠ్య ప్రణాళిక అభివృద్ధి, విద్యార్థులకు ప్రాయోగిక నైపుణ్యాల కల్పనలో భాగస్వామ్యం కావడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఉద్యోగాల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని, స్థిరమైన పాలన కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో పేదరికాన్ని తగ్గించే దిశగా రాష్ట్రం ముందుకు సాగుతుందని లోకేశ్ పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!