

ఒకప్పుడు సముద్రయానంలో ప్రపంచ రికార్డు సృష్టించిన అమెరికా చారిత్రక నౌక ‘ఎస్‌ఎస్ యునైటెడ్ స్టేట్స్’ త్వరలో సముద్ర గర్భంలో మరో చరిత్ర సృష్టించనుంది. ఈ భారీ నౌకను అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి సమీపంలో, డెస్టిన్–ఫోర్ట్ వాల్టన్ బీచ్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ముంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ పగడపు దిబ్బగా మారనుంది. దశాబ్దాలుగా ఈ నౌకను సంరక్షిస్తున్న ఎస్‌ఎస్ యునైటెడ్ స్టేట్స్ కన్సర్వెన్సీ సంస్థ.. ఫ్లోరిడా తీరంలో దీనికి సంబంధించిన మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. నౌకకు చెందిన విలువైన భాగాలు, కళాఖండాలను అందులో ప్రదర్శించనుంది. ఇందులో భాగంగా ఓడకు ఉన్న రెండు భారీ పొగ గొట్టాలను ఇప్పటికే తొలగించి భద్రపరిచారు.
టైటానిక్ కంటే పెద్దదైన ఈ నౌక పొడవు 990 అడుగులు. విలాసవంతమైన ప్రయాణాలకే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో సైనిక బలగాలను తరలించేలా దీన్ని రూపొందించారు. 1950లో ప్రారంభమైన దీని నిర్మాణానికి 70 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చయింది. సాధారణంగా 1,900 నుంచి 2,000 మంది ప్రయాణికులను, యుద్ధ సమయాల్లో 14 వేల మంది సైనికులను తరలించే సామర్థ్యం దీనికి ఉంది. 1952లో తొలి ప్రయాణంలో న్యూయార్క్ నుంచి ఐరోపాకు మూడు రోజులు, 11 గంటల్లో చేరుకుని రికార్డు సృష్టించింది. నలుగురు అమెరికా అధ్యక్షులు హ్యారీ ట్రూమన్, డ్వైట్ ఐసెన్‌హోవర్, జాన్ ఎఫ్. కెన్నడీ, బిల్ క్లింటన్ కూడా ఈ నౌకలో ప్రయాణించారు. 1969లో సేవలను నిలిపివేసిన తర్వాత పలువురి చేతులు మారిన ఈ నౌక.. దశాబ్దాల పాటు ఓడరేవుల్లోనే నిలిచిపోయింది. 2024లో ఒకలూసా కౌంటీ దీనిని ఒక మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కృత్రిమ పగడపు దిబ్బగా మార్చేందుకు పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలను తొలగించి, లోపలి భాగాలను శుభ్రం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా చేపల వేట, డైవింగ్, పర్యాటక కార్యకలాపాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని కౌంటీ ఆశిస్తోంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!