

‘రామాయణ’ చిత్రంలో సీత పాత్రకు నటి సాయిపల్లవిని ఎంపిక చేయడంపై ఇటీవల చర్చ జరుగుతున్న నేపథ్యంలో హీరో ధనుష్ ఆమెకు మద్దతుగా నిలిచారు. సీత పాత్రలో సాయిపల్లవిని మించిన నటి మరొకరు లేరని ప్రశంసించారు. ఆమె నటన, అంకితభావం, భక్తిని కొనియాడారు. తన తాజా చిత్రం ‘ఓం’ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న ధనుష్.. సీత పాత్రలో సాయిపల్లవి నటనపై వస్తున్న విమర్శలను చూసి ఆశ్చర్యం కలిగిందని అన్నారు. షూటింగ్ విరామ సమయంలోనూ ఆమె ప్రార్థనలు చేస్తూ ఉండేవారని, భగవంతుడిపై ఎంతో భక్తి ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఆమె మనసు స్వచ్ఛమైనదని, అందంతో పాటు అద్భుతమైన నటన కూడా ఆమె సొంతమని ప్రశంసించారు.
గతంలో ‘మారి 2’ చిత్రంలో సాయిపల్లవితో కలిసి నటించిన ధనుష్.. మళ్లీ ‘ఓం’ కోసం ఆమెతో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. తొలిసారి కలిసి పనిచేసినప్పుడు సాయిపల్లవి చాలా మౌనంగా ఉండేవారని, కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడే మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం నటనపై ఆమెకు మరింత అవగాహన పెరిగిందని, హావభావాలు, తెరపై కనిపించే తీరు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. సీత పాత్రను పోషించడం అంత సులభం కాదని, అయినప్పటికీ సాయిపల్లవి ఎంతో చక్కగా నటించారని అన్నారు. ‘ఓం’ చిత్రంలో ఆమె నిత్యారెడ్డి అనే సీబీఐ అధికారిగా కనిపించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!