

రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామిక ప్రగతి ఎంత ముఖ్యమో.. పర్యావరణ పరిరక్షణ కూడా అంతే కీలకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు పర్యావరణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి పరిశ్రమ తన ప్రాంగణంలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేసి, సంరక్షించాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు దీనిని సామాజిక బాధ్యతగా స్వీకరించి, కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు.
పరిశ్రమల పరిసరాల్లో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించవచ్చని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, సిమెంట్, మైనింగ్, ఎనర్జీ, ఆహార శుద్ధి, ప్లాస్టిక్, పేపర్, వస్త్ర తదితర రంగాలకు చెందిన సుమారు 3,400 పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 26 పరిశ్రమల్లో 129 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం పెంపొందించే పైలట్ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. విశాఖపట్నం, శ్రీ సిటీ, పరవాడ తదితర ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఎస్‌ఈజెడ్‌లు 33 శాతం పచ్చదనం నిబంధనను అమలు చేయాలని సూచించారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50 శాతం పచ్చదనం సాధించాలన్న లక్ష్యంలో పారిశ్రామిక వర్గాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!