

తెలంగాణలో ప్రభుత్వ రంగంలో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను మరింత విస్తరించడంతో పాటు ప్రైవేట్ ఫర్టిలిటీ కేంద్రాల్లో ఏఆర్‌టీ, సరోగసీ చట్టాల అమలును కట్టుదిట్టం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ, ప్రైవేట్ ఫర్టిలిటీ, ఐవీఎఫ్ కేంద్రాల పనితీరును పరిశీలించారు. గాంధీ ఆస్పత్రి, పేట్లబుర్జు ఎంజీఎంహెచ్‌లోని ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాల్లో ఇప్పటివరకు 39,802 మంది రోగులకు సేవలు అందించగా, 20,185 ఫాలిక్యులర్ స్టడీలు, 521 ఐయూఐ, 545 ఐవీఎఫ్ ప్రక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల్లోనూ దశలవారీగా ఐవీఎఫ్ సేవలను విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.
రాష్ట్రంలో 477 ఏఆర్‌టీ, సరోగసీ కేంద్రాలు నమోదై ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఫర్టిలిటీ కేంద్రాల్లో 379 తనిఖీలు నిర్వహించగా 50 కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు వెల్లడించారు. వీటిలో రెండు కేంద్రాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయగా, తొమ్మిది కేంద్రాల అనుమతులను తాత్కాలికంగా రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రోగులపై అనవసర ఆర్థిక భారం పడకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. అలాగే పీసీపీఎన్‌డీటీ చట్టం అమలులో భాగంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు 2,600 తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. లింగ నిర్ధారణకు పాల్పడే అవకాశమున్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!