

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) విద్యార్థులు బ్యాటరీలతో నడిచే వాహనాలను రూపొందించడం అభినందనీయమని కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మణుగూరులో మంగళవారం నిర్వహించిన అభినందన కార్యక్రమానికి హాజరైన మంత్రి.. వాహనాలను రూపొందించిన విద్యార్థులు అడపా స్ఫూర్తి, పులిపాటి పార్థసారథిని అభినందించి, వారు తయారుచేసిన వాహనాలను ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో వినూత్న వాహనాలను రూపొందించడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.
విద్యార్థులకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో టాటా సంస్థ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఏటీసీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అవార్డుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం అందించేలా కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు కల్పించామని, త్వరలో మరో లక్ష ఉద్యోగాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఏటీసీలో శిక్షణ పూర్తి చేసి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన 50 మంది అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!