

లష్కరే తయ్యిబా ఉగ్ర సంస్థకు చెందిన లతీఫ్ భట్‌ను భద్రతాదళాలు ఇటీవల మట్టుబెట్టడంతో కశ్మీర్‌లో స్థానిక ఉగ్రవాదులు ఎవరూ మిగలలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సరిహద్దుకు ఆవల నుంచి సాగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై చర్చించేందుకు నిర్వహించిన రెండ్రోజుల సదస్సును గురువారం ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి సమస్యలను పూర్తిగా అరికట్టాలంటే విదేశాల్లో తలదాచుకుంటున్న నేరగాళ్లను భారత్‌కు తీసుకురావాల్సిన అవసరం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. 2019 నుంచి ఇప్పటివరకు 36 దేశాల నుంచి 303 మంది పరారీలో ఉన్న ఉగ్రవాదులను భారత్‌కు రప్పించినట్లు వెల్లడించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందిస్తున్న నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిర్మూలనకు రాష్ట్రాల పోలీసులు కృషి చేస్తున్నప్పటికీ, వారి మధ్య సమన్వయం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!