

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన 12 మంది రైలు బోగీల్లోకి వెళ్లి, తమ బంధువులను సీట్ల వద్ద కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. అయితే రైలు బయలుదేరే సమయం కావడంతో ఆటోమేటిక్ తలుపులు మూసుకుపోయాయి. దీంతో వారు బోగీల్లోనే చిక్కుకుపోయారు. బనారస్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న రైలు అప్పటికే కదలడంతో భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలో తలుపులు తెరవడం సాధ్యం కాలేదు. మహిళలు, పిల్లలు కూడా ఉన్న ఆ బృందం సుమారు 139 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఎటావా రైల్వే స్టేషన్‌లో దిగింది.
అక్కడ వారికి మరో షాక్ ఎదురైంది. సరైన ప్రయాణ టిక్కెట్లు లేకుండా రైలులో ప్రయాణించినందుకు రైల్వే అధికారులు మొత్తం రూ.36 వేల జరిమానా విధించారు. నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివం శర్మ ఈ ఘటనపై స్పందిస్తూ, వందేభారత్ బోగీల్లోకి అనుమతి లేకుండా వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఆ 12 మంది ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు కూడా కొనుగోలు చేయలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెప్పేందుకు రైల్వే స్టేషన్లకు వచ్చే వారు తప్పనిసరిగా ప్లాట్‌ఫామ్ టిక్కెట్లు కొనుగోలు చేయాలని, అనుమతి లేకుండా రైలు బోగీల్లోకి వెళ్లకూడదని అధికారులు సూచించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!