

తెలంగాణలోని సమ్మక్క సాగర్ బ్యారేజీకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఛత్తీస్‌గఢ్ సీఎంతో సమావేశమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని, సమ్మక్క సాగర్ బ్యారేజీలో గోదావరి జలాలను నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతుల విషయంలోనూ సహకరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన విష్ణుదేవ్ సాయి.. ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని రేవంత్ రెడ్డి వివరించారు. పూర్తి స్థాయి నీటి మట్టం 83 మీటర్ల వద్ద బ్యారేజీ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలుగా ఉంటుందని తెలిపారు. తొలుత కాంతనపల్లి వద్ద ప్రతిపాదించిన ప్రాజెక్టును ముంపు ప్రభావాన్ని తగ్గించేందుకు తుపాకులగూడెంకు మార్చినట్లు పేర్కొన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ప్రకారం పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతాయని, భారీ వరదల సమయంలోనూ ఈ విస్తీర్ణం 100 ఎకరాలకు మించదని వివరించారు. అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ఇప్పటికే చెల్లించిందని, ఐఐటీ ఖరగ్‌పూర్ జూలై 30న నివేదిక సమర్పించిందని తెలిపారు. భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులు చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌ఓసీతో పాటు మిగిలిన అనుమతులను త్వరగా మంజూరు చేయాలని సీఎం కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!