

అమెజాన్ సంస్థ భారత్‌లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా చేపట్టనున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.65 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ పెట్టుబడితో భారత్‌లో తన పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను గణనీయంగా విస్తరించడంతో పాటు, సుస్థిరమైన ఇంధన భద్రత దిశగా దేశం చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే భారత్‌లో ప్రకటించిన 4 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఈ మొత్తం అదనమని స్పష్టం చేసింది.
ఈ ప్రణాళికలో భాగంగా మొత్తం 934 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు కొత్త పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులను అమెజాన్ అభివృద్ధి చేయనుంది. కర్ణాటకలో 234 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు, అదే రాష్ట్రంలో 200 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టు, మధ్యప్రదేశ్‌లో 300 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, రాజస్థాన్‌లో 200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును చేపట్టనుంది. కర్ణాటకలోని 234 మెగావాట్ల ప్రాజెక్టు ఆసియాలో అమెజాన్ చేపడుతున్న అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా సంస్థ పేర్కొంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సుమారు 35 లక్షల ఇళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. 2040 నాటికి నెట్-జీరో కార్బన్ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఈ పెట్టుబడులు చేపడుతున్నట్లు తెలిపింది. అలాగే, 2030 నాటికి విద్యుత్ వినియోగం ద్వారా వెలువడే కర్బన ఉద్గారాలను ప్రపంచవ్యాప్తంగా 65 శాతం తగ్గించాలనే కొత్త లక్ష్యాన్ని కూడా ప్రకటించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!