

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యల కోసం 2డిఎకో స్కానింగ్ చేయించుకునే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం సోమ, గురు, శనివారాల్లో మాత్రమే 2డిఎకో స్కానింగ్ చేస్తున్నారు. దీంతో ఆయా రోజుల్లో పెద్ద సంఖ్యలో రోగులు రావడంతో స్కానింగ్ విభాగం కిక్కిరిసిపోతోంది. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రోగులు భారీ రద్దీ మధ్య నిరీక్షించాల్సి వచ్చింది. గంటల తరబడి వేచి ఉండటంతో కొందరు రోగులు నీరసించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా లోపలికి వెళ్లే విషయంలో కొందరి మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.
స్కానింగ్ పూర్తయిన తర్వాత బయటకు రావాలనుకునే రోగులు సైతం రద్దీ కారణంగా ఇబ్బందులు పడ్డారు. పెద్ద సంఖ్యలో రోగులకు వారంలో మూడు రోజులు మాత్రమే స్కానింగ్ అందుబాటులో ఉండటమే రద్దీకి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ప్రతిరోజూ 2డిఎకో స్కానింగ్ నిర్వహిస్తే రోగులపై ఒత్తిడి తగ్గడంతో పాటు నిరీక్షణ సమయం కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని స్కానింగ్ సేవలను మరిన్ని రోజులకు విస్తరించాలని వారు ఆసుపత్రి అధికారులను కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!