

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 21,012 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 31,460 పోలింగ్ కేంద్రాల్లో 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 2,128 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో ఎంపీటీసీ పదవులకు 18,843 మంది, జడ్పీటీసీ పదవులకు 2,169 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
పరిషత్ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,01,116 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించారు. వీరిలో రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, జోనల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు తదితరులు ఉన్నారు. అయితే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఐదు మండలాల్లో పూర్తిగా, మరో మండలంలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో పోలింగ్‌ను వాయిదా వేశారు. ఈ ప్రాంతాల్లో గురువారానికి బదులుగా శుక్రవారం ఓటింగ్ నిర్వహించనుండగా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!