

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ఏపీపీఎస్సీ శుభవార్త అందించింది. గ్రూప్-2 ఉద్యోగాల సంఖ్యను పెంచుతూ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసింది. తొలుత 686 పోస్టుల భర్తీకి ప్రాథమిక ప్రకటన జారీ చేయగా, తాజాగా ఆ సంఖ్యను 720కి పెంచింది. వీటిలో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. డిసెంబరు 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. పోస్టుల వివరాల్లో అత్యధికంగా డిప్యూటీ తహసీల్దారు పోస్టులు 203, డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులు 176, సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ-హెచ్‌ఓడీ) పోస్టులు 90 ఉన్నాయి. వివిధ శాఖల్లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 31 భర్తీ చేయనున్నారు. ప్రాథమిక ప్రకటనతో పోలిస్తే డిప్యూటీ తహసీల్దారు పోస్టుల సంఖ్య కూడా పెరిగింది.
గ్రూప్-2 నియామక ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 21న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఈ పరీక్షలో నిర్దేశించిన కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఇతర నియామక నిబంధనలను పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో వివరించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం స్థానిక కోటా కింద 95 శాతం పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల స్థానికతను ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన విద్యాసంస్థల ధ్రువీకరణ పత్రాల ఆధారంగా నిర్ధారించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!