

పర్యావరణహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలంటూ బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చేపట్టిన ప్రచారం వివాదానికి దారితీసింది. ఈ ప్రచారంలో భాగంగా సినీనటి దియా మీర్జా నటించిన వీడియోను బీఎంసీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భారీ శబ్దాలు, వాయు కాలుష్యానికి దూరంగా ఉంటూ దీపావళిని జరుపుకోవాలని ఆమె ఆ వీడియోలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వీడియోపై భాజపా నాయకుడు అమిత్ సతమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీపావళి పండుగను ఎలా జరుపుకోవాలో ఇతరుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, అది తమ సంస్కృతిలో భాగమని అమిత్ సతమ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ అభ్యంతరాల అనంతరం దియా మీర్జా నటించిన వీడియో బీఎంసీ సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగిపోయింది. అయితే దీనిపై బీఎంసీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా, పర్యావరణహిత దీపావళి సందేశంతో నటి మాధురీ దీక్షిత్, క్రికెటర్ అజింక్య రహానే, మరాఠీ నటి నిషిగంధా వాడ్ నటించిన ఇతర వీడియోలు మాత్రం ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!