

హరియాణాలోని రోహ్‌తక్ సమీపంలో మిలాన్ దాబా వద్ద జరిగిన నలుగురి హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్‌స్టర్ సన్నీ రిటోలియాను ఓ యువతి హనీట్రాప్‌లోకి దించి, ప్రత్యర్థి హిమాన్షూ బావూ గ్యాంగ్‌కు అతడి ఆచూకీ అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు ప్రకారం.. సదరు యువతి దాదాపు మూడున్నర నెలలుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సన్నీతో పరిచయం పెంచుకుంది. క్రమంగా అతడికి దగ్గరై నమ్మకాన్ని సంపాదించింది. ఆమె హిమాన్షూ బావూ అనుచరుడు సాహిల్‌కు ప్రేయసిగా పోలీసులు గుర్తించారు. గతంలో హిమాన్షూ సోదరుడు రోహిత్, బంధువు భజరంగ్ హత్యల్లో సన్నీ పాత్ర ఉందనే ఆరోపణల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది. సన్నీని లక్ష్యంగా చేసుకోవడంలో సహకరిస్తే అమెరికాలో స్థిరపడేందుకు సాయం చేస్తామని హిమాన్షూ గ్యాంగ్ ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
గురువారం సన్నీ ఆ యువతితో పాటు తన అనుచరులు రింకూ, యశ్, వినీత్‌లతో కలిసి మిలాన్ దాబాకు భోజనానికి వెళ్లాడు. అదే సమయంలో మాస్కులు ధరించిన ఐదుగురు షూటర్లు ఒక్కసారిగా లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో రింకూ, యశ్, వినీత్ అక్కడికక్కడే మరణించగా.. సన్నీ తృటిలో తప్పించుకున్నాడు. కాల్పుల సమయంలో దాబాలో ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతడు తన బంధువును కలిసేందుకు అక్కడికి వచ్చినట్లు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో దాబాలో సుమారు 50 మంది కస్టమర్లు ఉన్నారు. కాల్పులు జరుగుతున్న సమయంలో సదరు యువతి కూడా అక్కడే ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది. హత్యల అనంతరం ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని భావించిన ఆమె బ్యాంకాక్‌కు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. ఈ హనీట్రాప్ కుట్ర, కాల్పుల వెనుక ఉన్న వ్యక్తుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!