

అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టంతో పాటు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరిస్తూ అమిత్ షాకు లేఖ రాశారు. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని విజ్ఞప్తి చేశారు. మురసు తుఫాను ప్రభావంపై అమిత్ షా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఒకే రోజు రెండుసార్లు కేంద్ర హోంమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. అర్నబ్ తుఫాను ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే మురసు తుఫాను పరిస్థితులను మరింత క్లిష్టంగా మార్చిందని తెలిపారు.
మురసు తుఫాను కారణంగా రాష్ట్రంలోని ఎనిమిది శాఖలకు సంబంధించి ప్రాథమికంగా రూ.343.95 కోట్ల నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందులో దాదాపు 94 శాతం నష్టం వ్యవసాయ రంగంలోనే ఉందని తెలిపారు. ఏడు జిల్లాల్లోని 465 గ్రామాల పరిధిలో 50,473 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 69,828 మంది రైతులు ప్రభావితమయ్యారని వివరించారు. సుమారు 45,900 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని, వ్యవసాయ రంగానికి ప్రాథమికంగా రూ.324.22 కోట్ల నష్టం అంచనా వేసినట్లు పేర్కొన్నారు. బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉందని, ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. తుఫాను ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ, అత్యవసర కార్యకలాపాల కేంద్రాలను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం 11 ఎస్‌డీఆర్ఎఫ్, 13 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయడంతో పాటు ప్రభావిత జిల్లాల్లో 480 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 12,230 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపినందుకు అమిత్ షాకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థ, సాగునీటి వనరులకు జరిగిన నష్టంపై సమగ్ర అంచనాలు రూపొందిస్తామని వెల్లడించారు. పూర్తి స్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. వరుస తుఫాన్ల కారణంగా రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడిందని, ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు కేంద్రం సహకరించాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!