

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ డే 58 ఎపిసోడ్లో మరింత వాడీవేడిగా సాగింది. ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకోగా, ముఖేష్, వర్షిణి ప్రధాన టార్గెట్లుగా మారారు. ఒకవైపు శివ, నరేష్, రామ్ ప్రసాద్ వర్షిణితో వాదనకు దిగగా, మరోవైపు త్రిగుణ్, శివ ముఖేష్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖేష్ గతంలో చేసిన వ్యాఖ్యలతో దేబ్జానీ కూడా తీవ్రంగా బాధపడినట్లు కనిపించింది. ఆరోపణలు, ప్రతివిమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యలతో నామినేషన్ల ఎపిసోడ్ హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
నామినేషన్ల సందర్భంగా వర్షిణి నరేష్‌ను టార్గెట్ చేస్తూ హోటల్ టాస్క్ సమయంలో ఝాన్సీ డబ్బులు అడిగినా ఇవ్వలేదని ప్రశ్నించింది. దేబ్జానీ చెప్పిన కారణంగానే నరేష్ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించింది. దీనికి నరేష్ స్పందిస్తూ ఆ డబ్బులు తనవని, వాటిని ఎలా ఖర్చు చేయాలనేది తన ఇష్టమని స్పష్టం చేశాడు. అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించాల్సిన అవసరం లేదని వర్షిణిపై అసహనం వ్యక్తం చేశాడు. అనంతరం రామ్ ప్రసాద్ వర్షిణిని నామినేట్ చేస్తూ, బయటకు స్నేహంగా ఉంటూనే లోపల మరోలా వ్యవహరిస్తోందని, తన ప్రయోజనాల కోసం నరేష్‌ను ఉపయోగించుకుందని ఆరోపించాడు. దీనికి వర్షిణి కౌంటర్ ఇస్తూ నరేష్ గ్రీన్ జోన్లోకి వెళ్లాడని, తాను మాత్రం వెళ్లలేదని చెప్పింది. ఆ తర్వాత శివను నామినేట్ చేసిన వర్షిణి, ఇంట్లోకి వచ్చిన తర్వాత తమ అలయెన్స్‌ను విడదీస్తానని చెప్పి ఆ పని చేశాడని, చివరకు ఝాన్సీ ఎలిమినేట్ అయిందని ఆరోపించింది. అయితే, ఝాన్సీ ఎలిమినేషన్‌కు ముఖేష్ ప్రవర్తనే కారణమని శివ బదులిచ్చాడు.
ముఖేష్ గతంలో దేబ్జానీ గురించి చేసిన వ్యాఖ్యలపై శివ, త్రిగుణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఒక మహిళ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని శివ ప్రశ్నించాడు. గేమ్‌లో మూడు స్టార్ల కోసం ఎంతవరకు దిగజారుతావంటూ ముఖేష్‌ను నిలదీశాడు. దేబ్జానీ కూడా ముఖేష్ ప్రవర్తనను తప్పుబడుతూ, టాస్కుల్లో వేగం, బ్యాలెన్స్ కంటే వ్యక్తిత్వం, ప్రవర్తన ముఖ్యమని పేర్కొంది. ముఖేష్‌ను నామినేట్ చేస్తూ అతడి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరకు 'ఐ పిటీ ఆన్ యూ ముకేష్' అంటూ భావోద్వేగానికి గురైంది. త్రిగుణ్ సైతం ముఖేష్ ఆలోచనా విధానాన్ని తప్పుబడుతూ డర్టీ మైండ్, వల్గర్ మైండ్ అంటూ విమర్శించాడు. దీనికి ముఖేష్ ఎదురుదాడి చేస్తూ త్రిగుణ్ సమాజానికి హానికరమని వ్యాఖ్యానించాడు. మరోవైపు, ముఖేష్, వర్షిణిపై త్రిగుణ్, శివ ఉపయోగించిన భాషపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రోహిత్‌ను టార్గెట్ చేసిన త్రిగుణ్ టీమ్, ఇప్పుడు ముఖేష్, వర్షిణిపై దృష్టి పెట్టిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో హౌస్‌లో పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!