

చైనా రిటైలర్ పాంగ్ డాంగ్ లై ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న ప్రత్యేకమైన ‘అన్‌హ్యాపీ లీవ్’ పాలసీ భారత కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యు డాంగ్ లై 2024లో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఉద్యోగులు మానసికంగా సంతోషంగా లేని సమయంలో ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్, కుటుంబ అత్యవసర పరిస్థితి లేదా సుదీర్ఘ వివరణ లేకుండానే ఏడాదికి 10 రోజుల వరకు అదనపు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. ఉద్యోగి కోరినప్పుడు మేనేజర్ ఈ సెలవును తిరస్కరించకూడదన్నది కంపెనీ నిబంధన. పని చేయడానికి మానసికంగా సిద్ధంగా లేని సమయంలో ఉద్యోగులకు విరామం ఇవ్వాలన్నదే ఈ పాలసీ ఉద్దేశం.
వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఈ పాలసీపై ఎక్స్ వేదికగా చర్చకు తెరతీయడంతో భారత్‌లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలు పని సామర్థ్యంపై ప్రభావం చూపుతాయని, అలాంటి సమయంలో కొంత విశ్రాంతి ఉద్యోగి, సంస్థకు ఇద్దరికీ ప్రయోజనకరమని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం అదనంగా 10 రోజుల సెలవు ఇవ్వడం మాత్రమే బర్నౌట్, అధిక పని ఒత్తిడికి పరిష్కారం కాదని పేర్కొన్నారు. పాంగ్ డాంగ్ లైలో రోజుకు ఏడు గంటల పని, వారాంతపు సెలవులు, ఏడాదికి 30–40 రోజుల వార్షిక సెలవులు, లూనార్ న్యూ ఇయర్‌కు అదనపు సెలవులు వంటి ఉద్యోగి అనుకూల విధానాలు కూడా ఉన్నాయి. దీంతో ‘అన్‌హ్యాపీ లీవ్’ కంటే మెరుగైన వర్క్ కల్చర్ అవసరమా? అనే చర్చ మొదలైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!