

వచ్చే ఏడాది జూన్ 2 నాటికి అల్వాల్, ఎల్‌బీ నగర్ టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ పనులను పూర్తి చేసి పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆసుపత్రుల నిర్మాణం, వైద్య పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామకాలను సమాంతరంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మూడు టిమ్స్ ఆసుపత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలకు ఏకీకృత విధానాన్ని అనుసరించాలని, అవసరాలకు అనుగుణంగా సిబ్బంది బదిలీలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రుల నిర్వహణ, హౌస్‌కీపింగ్ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్ విధానంలో చేపట్టాలని, పర్యవేక్షణకు గ్రూప్-1 అధికారులు, విశ్రాంత సైనికాధికారులను నియమిస్తామని తెలిపారు.
నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో సనత్‌నగర్ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం సూచించారు. నిమ్స్‌లో పడకలు అందుబాటులో లేకపోయినా, శస్త్రచికిత్సల్లో జాప్యం జరిగినా సనత్‌నగర్ టిమ్స్ సేవలను ఉపయోగించుకోవాలని, ఈ ఆసుపత్రుల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని ఆదేశించారు. టిమ్స్‌లో వైద్యుల నియామకాలు పూర్తయ్యే వరకు బయటి నుంచి వైద్యులను నియమించుకోవాలని, అందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న 79 డయాలసిస్ కేంద్రాల పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరుతో పాటు ఏఐ ఆధారిత పర్యవేక్షణ అమలు చేయాలని సూచించారు. మూడేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 30 వేల నుంచి 38 వేలకు పెరిగిందని, వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బంది కలిపి 13,401 నియామకాలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మరో 5,640 నియామకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ వైద్య, ఆరోగ్య శాఖకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!