

నవంబర్ 20 ప్రాంతంలో కోస్తాంధ్ర తీరాన్ని తుఫాను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నవంబర్ 16న అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రంలో వాతావరణ పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి సోమవారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీని ప్రభావంతో నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కేంద్ర బృందం చేసిన సిఫార్సులను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. ముందుగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ సరఫరా నిలిచిపోతే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల వచ్చే వరద నీటిని రిజర్వాయర్లకు మళ్లించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!