

మురసు తుఫాను ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు రూ.1,918.55 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. మృతుల్లో బాపట్ల జిల్లాకు చెందిన ఐదుగురు, గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు, పల్నాడు జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. తుఫాను ప్రభావంతో 1,43,122 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతినగా, 1,86,063 మంది రైతులు నష్టపోయారు. అలాగే 6,749 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతినడంతో 12,586 మంది రైతులు ప్రభావితమయ్యారు. మొత్తం 983 ఇళ్లు, 346 పడవలు, 220 చేపల వలలు ధ్వంసమయ్యాయి.
తుఫాను అనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్యుత్, మున్సిపల్ పరిపాలన, పంచాయతీరాజ్ శాఖల్లో జరిగిన నష్టాన్ని, చేపడుతున్న సహాయక చర్యలను సమీక్షించారు. వరద నీరు తగ్గిన తర్వాత పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయడానికి 48 నుంచి 72 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా, రహదారులు, తాగునీటి సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. దెబ్బతిన్న 3,946 విద్యుత్ స్తంభాల్లో 1,493 స్తంభాలను ఇప్పటికే పునరుద్ధరించారు. ప్రధాన జిల్లా, రాష్ట్ర రహదారులపై 760.10 కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లగా, పంచాయతీరాజ్ పరిధిలో 74 గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణకు రూ.92.08 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు శుక్రవారం పర్యటించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!