

గత నాలుగు రోజులుగా ఇండియా కూటమి ఆందోళనలతో మధ్య ఢిల్లీలోని పలు ప్రాంతాలు ప్రభావితమవుతున్న నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం జంతర్ మంతర్ వద్ద బీజేపీ, వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా నిరసనలు చేపట్టనున్నాయి. వివిధ రాజకీయ, విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. శనివారం దాదాపు 50 వేల మంది ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఢిల్లీ పోలీసులకు అదనంగా సుమారు 26 వేల మంది సాయుధ బలగాల సిబ్బందిని మోహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 7 వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని తక్షణమే ఢిల్లీకి తరలించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించినట్లు సమాచారం. జంతర్ మంతర్ సహా మధ్య ఢిల్లీలోని సమస్యాత్మక ప్రాంతాల్లోకి ప్రజల ప్రవేశంపై ఆంక్షలు విధించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. నగరంలోకి ప్రవేశించే ప్రధాన సరిహద్దు మార్గాలన్నింటిలోనూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు.
ఈ నెల 12వ తేదీ వరకు అదనంగా సుమారు 26 వేల మంది భద్రతా సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 5 వేల మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. అవసరాన్ని బట్టి మరో 10 వేల మంది ఢిల్లీ పోలీసులను మోహరించే అవకాశముంది. జంతర్ మంతర్, పార్లమెంట్ వైపు వెళ్లే మార్గాల్లో బహుళ అంచెల బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా మధ్య ఢిల్లీలోని మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ ఢిల్లీ ఎక్సైజ్ శాఖకు పోలీసులు లేఖ రాశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!