

ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశ సైనికుల ప్రాణనష్టానికి సంబంధించి సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. రష్యాకు చెందిన ఫెడరల్ స్టేట్ స్టాటిస్టిక్స్ సర్వీస్ (రోస్టాట్) ప్రభుత్వ రికార్డులు హ్యాకింగ్‌కు గురై లీకైనట్లు వచ్చిన సమాచారం ఆధారంగా పలు మీడియా సంస్థలు మరణాల గణాంకాలను విశ్లేషించాయి. 2026 సెప్టెంబర్ చివరి నాటికి కనీసం 4.9 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు అంచనా వేశాయి. మరణాల నమోదు ఆలస్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 7 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నాయి. మరణించిన వారిలో దాదాపు 7 వేల మంది 18–19 ఏళ్ల యువకులేనని, సైనికుల సగటు వయసు 2022లో 33 ఏళ్లుగా ఉండగా 2026 నాటికి 40 ఏళ్లకు పెరిగిందని వెల్లడించాయి.
యుద్ధం కారణంగా రష్యా సైనికుల్లో ఆత్మహత్యల సంఖ్య కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు మీడియా సంస్థల విశ్లేషణ పేర్కొంది. ఐదేళ్ల వ్యవధిలో సుమారు 1,229 మంది సైనికులు బలవన్మరణాలకు పాల్పడినట్లు అంచనా వేసింది. వీరిలో సగం మంది సరిహద్దు ప్రాంతాల్లోనే మరణించినట్లు భావిస్తున్నారు. సైనిక శిబిరాలు, శిక్షణా కేంద్రాలు, ప్రైవేటు నివాసాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. యుద్ధంలో పాల్గొనేందుకు ఒప్పందాలపై సంతకాలు చేయాలని సైనికులపై ఒత్తిడి చేయడం ఆత్మహత్యలకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, యుద్ధంలో ప్రాణనష్టంపై రష్యా ప్రభుత్వం చివరిసారిగా 2022లోనే అధికారిక గణాంకాలను వెల్లడించింది. స్వతంత్ర నివేదికల విశ్వసనీయతను రష్యా ప్రశ్నిస్తుండగా, రోస్టాట్ నుంచి డేటా లీక్ కాలేదని కూడా పేర్కొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!