

కార్తికమాసం రెండో సోమవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తిక దీపాలు వెలిగించి, పరమశివుడిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో పలు ఆలయాల్లో రద్దీ నెలకొంది. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. కార్తిక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించి స్వామివారికి పూజలు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం, నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఏకచక్రేశ్వర ఆలయం, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజమహేంద్రవరం నగరంలోని పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో దీపాలు వదులుతూ భక్తులు పూజలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఆలయాల్లోనూ భక్తుల సందడి కనిపించింది. కడప జిల్లా కమలాపురంలోని పాతాళ సోమేశ్వరస్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భీమేశ్వరాలయం, ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!