

గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ ప్రదేశం తనకు రెండో ఇల్లు లాంటిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పార్టీ కష్టకాలంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని తెలిపారు. పార్టీని కాపాడేందుకు తాము చేసిన కృషి, కార్యకర్తల శ్రమ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. పార్టీ రెండోసారి కూడా అధికారంలోకి రావడానికి అవసరమైన పలు సూచనలను ఇన్‌చార్జి బీఎం సందీప్‌కు వివరించినట్లు చెప్పారు. గత మూడేళ్లలో చాలా మంది కార్యకర్తలకు తగిన గుర్తింపు, న్యాయం దక్కలేదని, కొంతమందికే అవకాశాలు లభించాయని అభిప్రాయపడ్డారు.
ఇరిగేషన్ రంగం గురించి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలోనే కృష్ణా, గోదావరి జలాల వినియోగం గతంలో ఎన్నడూ లేనంతగా జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ దిగుబడులు కూడా పెరిగాయని అన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పాలకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ, సీతారామ వంటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని వెల్లడించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీ ఇన్‌చార్జి బీఎం సందీప్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు. నాయకుల మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన అవసరంపైనా మాట్లాడినట్లు వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి అందరూ కలిసికట్టుగా కష్టపడి పనిచేస్తామని తుమ్మల స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!