

పెరుగుతున్న ఇంధన ధరలు, విమాన టికెట్ల ధరల పెంపు దేశీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య, సీట్ల భర్తీ శాతం తగ్గుతున్నట్లు తాజాగా విడుదలైన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది నవంబరు మొదటి వారంతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో దేశీయ విమానాల్లో ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) గణనీయంగా తగ్గింది. అందుబాటులో ఉన్న సీట్లలో ప్రయాణికులు ఆక్రమించిన సీట్ల శాతాన్ని పీఎల్‌ఎఫ్‌గా పరిగణిస్తారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఈ తగ్గుదల 12.1 శాతంగా నమోదైంది. దేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో ఇదే అత్యధికం. హైదరాబాద్‌లోని విమానయాన సంస్థల సర్వీసులకు సంబంధించి సీట్ల భర్తీ గణాంకాల్లో 1,58,444 మేర తగ్గుదల నమోదైనట్లు సమాచారం. చెన్నైలో 1,05,604 (11.7 శాతం), అహ్మదాబాద్‌లో 46,328 (7.7 శాతం), గౌహతిలో 20,290 (6.6 శాతం), కోల్‌కతాలో 45,916 (4.6 శాతం), ఢిల్లీలో 1,02,959 (3.4 శాతం) తగ్గుదల నమోదైంది. గోవా, బెంగళూరు, ముంబై విమానాశ్రయాల్లోనూ తగ్గుదల కనిపించింది.
విమాన ఇంధన ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు టికెట్ ధరలను పెంచుతున్నాయి. రష్యా–ఉక్రెయిన్, అమెరికా–ఇరాన్ యుద్ధాల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడటంతో విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు పెరిగినట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు భారంగా మారడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప విమాన ప్రయాణాలకు ఆసక్తి చూపడం లేదని గణాంకాలు సూచిస్తున్నాయి. దీంతో తక్కువ మంది ప్రయాణికులతో విమానాలు నడపాల్సి వస్తుండటంతో నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థలు కొన్ని సర్వీసులను కుదిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి నడిచే ప్రధాన రూట్లలోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. గత ఏడాది ఢిల్లీ–హైదరాబాద్ మధ్య వారానికి సగటున 408 సర్వీసులు ఉండగా, ప్రస్తుతం 322కి తగ్గాయి. హైదరాబాద్–తిరుపతి సర్వీసులు 168 నుంచి 82కి, హైదరాబాద్–చెన్నై సర్వీసులు 190 నుంచి 132కి పడిపోయాయి. హైదరాబాద్ నుంచి పాట్నా, వారణాసి మార్గాల్లోనూ విమాన సర్వీసులు సగానికి పైగా తగ్గినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!