

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల నాలుగో రోజు అమ్మవారు శ్రీ మహా చండీదేవి రూపంలో కొలువుదీరుతారు. పురాణాల ప్రకారం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే త్రిశక్తుల సమాహారంగా మహా చండీదేవి ఆవిర్భవించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతరించిన ఈ అమ్మవారిని సకల రాక్షస సంహారిణిగా, శక్తిమంతమైన దైవ స్వరూపంగా భక్తులు ఆరాధిస్తారు. హరిద్వార్లోని నీలాచల పర్వతంపై వెలసిన చండీదేవి ఆలయం కూడా ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
శాస్త్రోక్త విశ్వాసాల ప్రకారం చండీదేవిని పూజించడం వల్ల విద్య, కీర్తి, ఐశ్వర్యం, విజయాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు లేదా బంగారు రంగు చీర సమర్పించి, ఎర్ర కలువ పూలతో పూజిస్తారు. కట్టుపొంగలి, చక్కెర పొంగలి, కదంబం, పులిహోర, లడ్డూలు, రవ్వ కేసరి వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. దుర్గా సప్తశతి, చండీ సప్తశతి, లలితా సహస్రనామం, శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రాలను పఠించడం శుభప్రదంగా భావిస్తారు. చండీదేవిని స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!