

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ప్రతినిధి బృందం తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులో ఇప్పటివరకు చేపట్టిన భద్రతా చర్యలు, భవిష్యత్తులో అమలు చేయనున్న పర్యవేక్షణ వ్యవస్థలను బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఎన్‌డీఎస్‌ఏ సదరన్ జోన్ డైరెక్టర్ గిరిధర్, డిప్యూటీ డైరెక్టర్ హేమాదిత్య ఈ పర్యటనలో పాల్గొన్నారు. ప్రాజెక్టు నమూనా ద్వారా నిర్మాణ స్వరూపం, పూర్తయిన పనులు, మిగిలిన పనుల పురోగతిని అధికారులు వివరించారు. ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజినీర్ పి. రామచంద్రరావు వివిధ విభాగాల పనుల పురోగతిని గణాంకాలతో సహా ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.
అనంతరం ఎన్‌డీఎస్‌ఏ బృందం స్పిల్‌వే, గ్యాప్-1, గ్యాప్-2, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించింది. ఆనకట్ట భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పరికరాలు, వాటి పనితీరుపై వివరాలు సేకరించింది. ప్రాజెక్టు భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు స్కాడా (SCADA) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెన్సార్లు, మీటర్లు, వాల్వుల నుంచి రియల్‌టైమ్ డేటాను సేకరించి నిర్మాణాల పనితీరును పర్యవేక్షించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐఐటీ రూర్కీ అత్యవసర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని, అది పూర్తయిన వెంటనే ఎన్‌డీఎస్‌ఏకు అందజేస్తామని తెలిపారు. ఆనకట్టల భద్రతా చట్టం-2021 ప్రకారం చేపడుతున్న ఈ పరిశీలనలో అధికారులు ఇచ్చిన వివరణలపై ఎన్‌డీఎస్‌ఏ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!