

గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాను అరికట్టి జిల్లాను గంజాయి రహితంగా మార్చే లక్ష్యంతో విజయవాడ పోలీసులు ప్రకటించిన ‘ఈగల్ ఛాలెంజ్’కు తొలి స్పందన లభించింది. ఓ వ్యక్తి అందించిన సమాచారాన్ని నిర్ధారించుకున్న పోలీసులు ఇస్లాంపేట దళవాయి వారి వీధిలో దాడి నిర్వహించారు. రాయఘడ్ నుంచి గంజాయిని తీసుకొచ్చి అక్కడ విక్రయిస్తున్నారన్న సమాచారంతో చేపట్టిన ఈ దాడిలో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి, సుమారు 1.36 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ గున్నం రామకృష్ణ గురువారం నిందితుల వివరాలను వెల్లడించారు. గంజాయి విక్రయాలు, తరలింపు, వినియోగానికి సంబంధించిన సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రామరాజ్యనగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కట్టా ప్రసాద్ (20), ఇస్లాంపేటకు చెందిన ఎస్.కె. అస్గర్, న్యూ రాజరాజేశ్వరీపేటకు చెందిన ఎస్.కె. మహ్మద్ ఇబ్రహీం ఖలీల్ (20) కలిసి రాయఘడ్ నుంచి రెండు కిలోల గంజాయిని రూ.25 వేలతో కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు తెలిపారు. అందులో 640 గ్రాములు వినియోగించగా, మిగిలిన 1.36 కిలోలను విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో టూటౌన్ సీఐ కొండలరావు నేతృత్వంలోని ఈగల్ టీమ్ దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. రాయఘడ్ నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందించిన వ్యక్తికి పోలీసులు రూ.5 వేల నగదు బహుమతిని అందజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!