

E20 పెట్రోల్‌పై కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కంపెనీలకు చెందిన పెట్రోల్ నమూనాలను పరిశీలించగా.. నిర్దేశించిన 20 శాతం కంటే అధికంగా ఇథనాల్ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. పలు ప్రధాన చమురు కంపెనీలు సరఫరా చేస్తున్న పెట్రోల్‌లోనూ అధిక స్థాయిలో ఇథనాల్ ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైనట్లు పేర్కొంది. ఈ పరీక్షలను ఎన్ఏబీఎల్ (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం 'ఆపరేషన్ నిఖార్' ప్రచారంలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి రిజ్వాన్ తెలిపారు. బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపూర్, బెంగళూరు రూరల్, రామనగర, మంగళూరు, తుమకూరు జిల్లాల్లో ప్రధాన ఇంధన బ్రాండ్‌లకు చెందిన E20 నమూనాలను సేకరించినట్లు పేర్కొన్నారు. అయితే, ప్రయోగశాల పరీక్షల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) పెట్రోల్‌లో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) పెట్రోల్‌లో 30.5 శాతం ఇథనాల్ గాఢత ఉన్నట్లు వెల్లడైందని ఆరోపించారు. ఈ పరిశోధనల ఫలితాలు ఇంధన నాణ్యత, వినియోగదారుల వాహనాల రక్షణ, ఇథనాల్ మిశ్రమానికి సంబంధించిన నిబంధనలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ మేరకు పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని బహిరంగంగా వెల్లడించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రులను కర్ణాటక ప్రభుత్వం కోరింది. నిర్దేశిత పరిమితులను మించి ఇథనాల్ గాఢతతో పెట్రోల్‌ను సరఫరా చేస్తున్నట్లు తేలిన ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇతర చమురు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల స్థాయిలో ఇంధన నాణ్యత తనిఖీలు నిర్వహించి, ఆ వివరాలనూ బహిరంగపరచాలని స్పష్టం చేసింది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు, పరీక్షలు కొనసాగించి, వాటి ఫలితాలను బహిర్గతం చేస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!