

ఆంధ్రప్రదేశ్‌లో రేపు జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 365 కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఐజీ బి. రాజకుమారి వెల్లడించారు. ఇందుకోసం భారీగా పోలీసు బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు.
కౌంటింగ్ విధుల కోసం మొత్తం 19,885 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. వీరిలో 135 మంది డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, 572 మంది ఇన్‌స్పెక్టర్లు, 1,412 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 14,877 మంది కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, 2,889 మంది హోంగార్డులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసు, ఎన్నికల అధికారులకు సహకరించాలని ఐజీ బి. రాజకుమారి విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!