

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని స్త్రీనిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో అనుసంధానిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు రూ.3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను స్త్రీనిధి రుణం ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ పథకం ద్వారా పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను జిల్లా వనరుల సంస్థలుగా పరిగణించి, ఆసక్తి మరియు సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తిస్తామని చెప్పారు. మహిళలకు కేవలం రుణం అందించడమే కాకుండా, వారి వ్యాపారం విజయవంతమయ్యే వరకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!