

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్)ను 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ వారి మూల వేతనంలో 60 శాతం నుంచి 63 శాతానికి చేరింది. ఈ పెంపు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో జూలై నుంచి అక్టోబర్ వరకు నాలుగు నెలలకు సంబంధించిన బకాయిలు కూడా ఉద్యోగులు, పింఛనుదారులకు అందనున్నాయి. రాబోయే జీతాలు, పింఛన్లతో పాటు ఈ బకాయిలను చెల్లించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 48.54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.71 లక్షల మంది పింఛనుదారులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.10,016.10 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా.
డీఏ పెంపుతో వివిధ వేతన స్థాయుల్లో ఉన్న ఉద్యోగుల నెలవారీ ఆదాయం పెరగనుంది. ఉదాహరణకు, లెవెల్-1 కింద రూ.18,000 మూల వేతనం పొందే ఉద్యోగికి ఇప్పటివరకు రూ.10,800 డీఏ అందుతుండగా, తాజా పెంపుతో అది రూ.11,340కు చేరుతుంది. అంటే నెలకు అదనంగా రూ.540 లభిస్తుంది. రూ.35,400 మూల వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు రూ.1,062, రూ.50,000 మూల వేతనం ఉన్న ఉద్యోగికి రూ.1,500 అదనంగా అందుతాయి. అలాగే రూ.25,000 మూల పింఛను పొందే వారికి నెలకు రూ.750 అదనపు ప్రయోజనం కలుగుతుంది. 6వ వేతన సంఘం పరిధిలోని ఉద్యోగుల డీఏను 262 శాతం నుంచి 269 శాతానికి, 5వ వేతన సంఘం పరిధిలోని ఉద్యోగుల డీఏను 483 శాతం నుంచి 497 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పింఛనుదారులకు ఈ పెంపు కొంత ఆర్థిక ఉపశమనం కల్పించనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!