

ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ప్రవళిక తల్లిని పరామర్శించి, ఆ కుటుంబానికి ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్యాంకు ద్వారా రూ.కోటి ప్రమాద బీమా పరిహారం కూడా కుటుంబానికి అందుతుందని పేర్కొన్నారు.
ప్రవళికను కోల్పోవడం ఆర్టీసీ కుటుంబానికి తీరని లోటని పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయామని తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఆర్టీసీ సిబ్బంది ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమస్యలను చట్టపరంగా పరిష్కరించుకోవాలే తప్ప, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేశారు. కార్మికుల భద్రత, ప్రయాణికుల సౌకర్యం రెండూ ఆర్టీసీకి సమాన ప్రాధాన్యమని స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!